
ఏక్తా కపూర్ నిర్మించిన ‘డర్టీ పిక్చర్’ చిత్రంపై దాఖలైన పిటిషన్ ను రాష్ట్ర హైకోర్టు ఈ రోజు కొట్టివేసింది. దీంతో చిత్రం విడుదలపై వున్న సందిగ్దం విడిపోయింది. ఈ చిత్రాన్ని రేపు (డిసెంబర్ 2) ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. తన సోదరి సిల్క్ స్మిత జీవితాన్ని వక్రీకరించి ఈ చిత్రాన్ని నిర్మించారనీ, తమ అనుమతి తీసుకోకుండానే చిత్ర నిర్మాణాన్ని జరిపారనీ స్మిత సోదరుడు నాగవరప్రసాద్ హైకోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే. చిత్రం విడుదల కాకుండా నిలిపి వేయించాల్సిందిగా ఆయన చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. ఇందులో సిల్క్ స్మిత పాత్రలో విద్యాబాలన్ నటించింది.
చరణ్ నిశ్చితార్దానికి ఏక్సస్ కార్డులు

రామ్ చరణ్, ఉపాసనల వివాహ నిశ్చితార్ధం రేపు రాత్రి ఏడున్నర గంటలకు జరుగుతుందని చిరంజీవి చెప్పారు. ఇది పూర్తిగా వ్యక్తిగత కార్యక్రమం కాబట్టి ఆహ్వానితులకు మాత్రమే ప్రవేశం ఉంటుందని ఆయన తెలిపారు. అభిమానులు ఈ కార్యక్రమానికి రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. హైదరాబాదు శివారు చిలుకూరు దగ్గరలోని ఉపాసనకు చెందిన ఫామ్ హౌస్ లో జరుగుతున్న ఈ వేడుకకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అతిధులు విచ్చేస్తున్నారు. పొతే, ఈ వేడుకకు సంబంధించిన ఆహ్వాన పత్రికల్ని వెరైటీగా ముద్రించారు. కార్ పాస్ తో బాటు ఎంట్రీ పాస్ ను ఎలక్ట్రానిక్ కార్డుల రూపంలో ఏక్సస్ కార్డులుగా తయారుచేశారు. దీని వల్ల ఆహ్వానితులు తప్ప వేరే వాళ్లెవరూ లోపలకి ప్రవేశించలేరు. తెలంగాణా వాదులెవరూ అక్కడ చేరి, ఆందోళన చేయకుండా ఈ జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది!
పవన్ కళ్యాన్ పొలిటికల్ డ్రామా?

పవన్ కళ్యాన్ రాజకీయ నేపథ్యంతో కూడిన సినిమా చేయనున్నాడా? అవుననే అంటున్నారు టాలీవుడ్ జనం. కుళ్లు రాజకీయాలను వెండితెరపై చీల్చి చెండాడడానికి పవన్ సమాయత్తమవుతున్నాడని తెలుస్తోంది. తన తదుపరి చిత్రానికి రాజకీయ నేపథ్యాన్ని ఆయన ఎంచుకుంటున్నారని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ప్రముఖ ఆంధ్రా నాయకుడి కథను పవన్ తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడట. ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తాడు. ప్రముఖ రచయిత కోన వెంకట్ ఇందుకు సంబంధించిన కథను తయారు చేసే పనిలో ప్రస్తుతం బిజీగా వున్నాడు. ఈ పొలిటికల్ డ్రామాను బండ్ల గణేష్ నిర్మిస్తాడు.
సూపర్ స్టార్ సినిమాలో స్వీటీ
a href=”http://www.telugubest.com/wp-content/uploads/2011/11/rajni-kanth-anushka-rana-1.jpeg”>
స్వీటీ అనుష్కకు సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో నటించే చాన్స్ వచ్చింది. రజనీకాంత్ కథానాయకుడుగా ఆయన చిన్న కూతురు సౌందర్య దర్శకత్వంలో ‘కొచ్చాడియాన్’ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు కె.యస్.రవికుమార్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే సమకూర్చడమే కాకుండా, దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేయనున్నారు. కాగా, ఈ చిత్రంలో కథానాయికగా అనుష్కను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. రజనీ వయసుకు తగ్గట్టుగా అనుష్క అయితేనే ఆ పాత్రకు సరిపోతుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. చిత్ర వర్గాలు అనుష్కను కాంటాక్ట్ చేశాయనీ, ఆమె కూడా అందుకు వెంటనే అంగీకరించిందనీ కోలీవుడ్ సమాచారం.
<
కిషన్జీ ఇతివృత్తంతో నారాయణమూర్తి సినిమా

పోలీసుల ఎదురుకాల్పుల్లో మరణించిన మావోయిస్టు అగ్రనేత కిషన్ జీ (మల్లోజుల కోటేశ్వరరావు) జీవితాన్ని తెరకెక్కిస్తున్నట్టు ప్రముఖ దర్శక, నిర్మాత, నటుడు ఆర్.నారాయణమూర్తి ప్రకటించారు. ‘దండకారుణ్యం’ పేరుతో ఈ చిత్ర నిర్మాణాన్ని చేబడుతున్నట్టు ఆయన తెలిపారు. కిషన్ జీ అంత్యక్రియలలో పాల్గొనడానికి ఈ రోజు కరీం నగర్ జిల్లా పెద్దపల్లి వచ్చిన నారాయణమూర్తి, చితిపై మావోయిస్టు నేతను చూసి కంటతడి పెట్టారు. తాడిత పీడిత ప్రజల కోసం పోరాటం చేసిన కిషన్ జీని ఎన్ కౌంటర్ చేయడం దారుణమని బాధతో అన్నారు.
సీతా వెడ్స్ రాముడు

ప్రముఖ హాస్యనటుడు సునీల్, తాజాగా ‘పూలరంగడు’ సినిమాలో కథానాయకుడుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. వీరభద్రం చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగు పూర్తి కాగానే సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మించే చిత్రంలో సునీల్ నటిస్తాడు. హిందీలో హిట్ అయిన ‘తనూ వెడ్స్ మను’ చిత్రం ఆధారంగా రూపొందే ఈ చిత్రానికి దేవీప్రసాద్ దర్శకత్వం వహిస్తాడు. కాగా, ఈ చిత్రానికి ‘సీతా వెడ్స్ రాముడు’ అనే టైటిల్ని ఖరారు చేసినట్టు తాజా సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.
అభిమాని ‘మెగా’ బహుమతి

రామ్ చరణ్ వివాహ నిశ్చితార్ధం సందర్భంగా అతని కాబోయే భార్య ఉపాసనకు, అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన చిరంజీవి అభిమాని అన్వర్ ‘స్వర్ణ హంసల’ చీరను బహుమతిగా ఇవ్వనున్నాడు. ఈ చీర తయారీకి సుమారు నలభై వేల రూపాయలు ఖర్చుపెడుతున్నాడు. కోల్ కతాకు చెందిన ఆరుగురు కార్మికులు ఈ చీర తయారీలో నిమగ్నమయ్యారు. కళ్ళు జిగేల్మనిపించే స్టోన్స్, కుందన్ వర్క్, బంగారు పూతతో ప్యాచ్ వర్క్, కొంగుభాగంలో రెండు స్వర్ణ హంసలుండేలా ఈ చీరను ఆకర్షణీయంగా డిజైన్ చేస్తున్నట్టు అన్వర్ చెబుతున్నాడు.
బాలకృష్ణ నాయనమ్మగా జయసుధ

ప్రముఖ నటి జయసుధ తాజాగా నందమూరి బాలకృష్ణకు బామ్మగా నటిస్తోంది. పరుచూరి మురళి దర్శకత్వంలో కె.ఎల్.కుమార్ చౌదరి నిర్మిస్తున్న ‘అధినాయకుడు’ చిత్రంలో బాలకృష్ణ మూడు పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాత, కొడుకు, మనవడుగా ఆయన మూడు తరాల ప్రతినిధిగా ఇందులో కనిపిస్తారు. తాత పాత్ర చిత్రంలో కీలకం కూడా! దీనికి సంబంధించిన ప్రధాన సన్నివేశాలను ఆమధ్య కర్నూలు పట్టణంలో వేలాది మంది ప్రజల మధ్య చిత్రీకరించారు. ఇప్పుడీ పాత్రకు భార్యగా జయసుధ నటిస్తున్నారు. అంటే, మూడో తరం బాలకృష్ణ పాత్రకు ఆమె నాయనమ్మ అవుతుందన్న మాట! ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది.
Old telugu songs
Old telugu songs
సౌదీ అరేబియాలో రవితేజ ‘నిప్పు’

రవితేజ తాజాగా నటిస్తున్న ‘నిప్పు’ చిత్రం షూటింగు వచ్చే నెల 10 నుంచి సౌదీ అరేబియాలో జరుగుతుంది. సౌదీలో ఇంతవరకు ఎవ్వరూ చేయని లొకేషన్లలో పది రోజుల పాటు షూటింగు చేస్తామనీ, దీంతో మొత్తం పూర్తవుతుందనీ నిర్మాత వై.వి.యస్. చౌదరి చెప్పారు. గుణశేకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగు ప్రస్తుతం హైదరాబాదులోని వివిధ లొకేషన్లలో జరుగుతోంది. డిసెంబర్ 9 వరకు హైదరాబాదులో చేసి, 10 వ తేదీకి సౌదీకి షిఫ్ట్ అవుతామని నిర్మాత తెలిపారు. డిసెంబర్ 13 న ఆడియోను, జనవరి 13 న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రవితేజ పక్కన దీక్షా సేథ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్ ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. తమన్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు.
ఊపేస్తున్న ‘వై దిస్ కొలవెరి’ పాట!

తమిళ ప్రేక్షకుల్ని ఇప్పుడు పిచ్చెక్కిస్తున్న పాట ‘కొలవెరి’ పాట. తమిళ హీరో, రజనీకాంత్ అల్లుడు ధనుష్ తన భార్య ఐశ్వర్య దర్శకత్వంలో నటిస్తున్న ’3′ సినిమా కోసం ఆయనే స్వయంగా రాసుకుని పాడిన ‘వై దిస్ కొలవెరి…’ పాట యువతను ఇప్పుడు ఊపేస్తోంది. ఇంటర్నెట్ లో ఈ పాట ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. దీనిని ఇటీవలే యూ ట్యూబ్ లో పెట్టారు. ఆంగ్లం, తమిళం కలగలిసిన ఈ ‘కొలవెరి’ పాట అందర్నీ ఉర్రూతలూగిస్తోంది. యూ ట్యూబ్ లో పెట్టి పది రోజులు కూడా కాకుండానే, ఈ పాటకు నలభై లక్షల క్లిక్స్ వచ్చాయి. కేవలం అభిమానులే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ ప్రముఖుల్ని కూడా ఈ పాట ఎంతగానో ఆకర్షిస్తోంది. ఇంతకీ ఈ ‘కొలవెరి’ అన్న తమిళ పదానికి అర్ధం తెలుసా… ‘చంపేంత కసి’ అని అర్ధమట. అందుకే ఇది అందర్నీ తీపిగా చంపేస్తోంది!
పెళ్లికొడుకవుతున్న సిద్ధార్థ్!

సిద్ధార్థ్ త్వరలో పెళ్లికొడుకు కాబోతున్నాడన్నది తాజా కబురు. దీనికి సిద్ధూ నుంచి కూడా సానుకూల సంకేతాలు వస్తున్నాయి. పెళ్లి చేసుకోబోతున్నారా? అని ఇటీవల అడిగితే, “ఓ నెల తర్వాత సమాధానం చెబుతాను” అంటున్నాడు నవ్వుతూ. అంతేకానీ, ఆ వార్తని మాత్రం ఖండించడం లేదు. 2003 లో తన స్నేహితురాలు మేగ్నాను పెళ్లి చేసుకున్న సిద్ధూ, ఆ తర్వాత అభిప్రాయబేధాలు రావడంతో 2006 లో ఆమె నుంచి విడాకులు తీసుకున్నాడు. ఇటీవల కమలహాసన్ కూతురు శృతిహాసన్ తో ప్రేమలో పడ్డాడని వార్తలు వచ్చాయి. మరి ఇప్పుడు శృతినే చేసుకుంటాడా? లేక మరెవరినైనానా? అన్నది ఓ నెల తర్వాత తెలుస్తుందన్న మాట!
కోర్టుకెక్కిన వర్మ ‘రామాయణం’

అందరూ ఊహించినట్టుగానే రాంగోపాల్ వర్మ తీయబోయే ‘రామాయణం’ సినిమా ప్రారంభానికి ముందే వివాదం అయింది. వర్మ చెబుతున్న విధంగా ఈ సినిమా కథ, పేరు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వున్నాయంటూ వరంగల్ కు చెందిన సత్యప్రకాష్ అనే న్యాయవాది రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ కు ఫిర్యాదు చేశారు. హిందువులు పవిత్రంగా భావించే రామాయణం పేరును టైటిల్ గా పెట్టడం భావ్యం కాదనీ, వెంటనే టైటిల్ మార్చాల్సిందిగా ఆదేశించాల్సిందిగా ఆ న్యాయవాది కోరారు. వర్మకు కూడా ఆయన ఈ విషయంలో లీగల్ నోటీసులు పంపారు. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున రావణ్ రాజు పాత్ర పోషించనున్న సంగతి తెలిసిందే!
బుల్లి ఐష్ ఫోటోకి బిగ్ ఆఫర్!

ఇటీవల పుట్టిన ఐశ్వర్యా రాయ్ కూతురు ఫొటోను తామే ముందుగా అందించాలన్న ఆత్రంలో జాతీయ, అంతర్జాతీయ మీడియా పోటీపడుతోంది. దానికి తోడు ‘మా మనవరాలు అచ్చు గుద్దినట్టు అంతా తల్లి పోలికే’ అంటూ అమితాబ్ చెప్పడంతో, మీడియా కుతూహలం మరింత పెరిగింది. ఐష్ కు డెలివరీ అయిన వెంటనే కొన్ని ఫోటోలు ఇంటర్నెట్ లో హల్ చల్ చేసినప్పటికీ, అవన్నీ మార్ఫింగ్ ఫోటోలే అన్నది తేలిపోయింది. ఈ నేపథ్యంలో బుల్లి ఐష్ ఫోటో కోసం కొన్ని మీడియా సంస్థలు అమితాబ్ కు కోట్లాది రూపాయల ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే, అమితాబ్ వాటిని సున్నితంగా తిరస్కరించాడనీ, త్వరలోనే తమ మనవరాలి ఫోటోలను మీడియాకు విడుదల చేస్తామని చెప్పాడనీ బాలీవుడ్ సమాచారం.
ఫిలిం ఫెస్టివల్ లో ‘శ్రీరామరాజ్యం’

బాలకృష్ణ శ్రీరాముడుగా, నయనతార సీతాదేవిగా బాపు రూపొందించిన దృశ్యకావ్యం ‘శ్రీరామరాజ్యం’ చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. ప్రస్తుతం గోవాలో జరుగుతున్న 42 వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ‘శ్రీరామరాజ్యం’ చిత్రం ప్రత్యేక ప్రదర్శనకు ఎంపికైంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత యలమంచలి సాయిబాబు మీడియాకు తెలిపారు. ఈ నెల 28 న ఐదు వందల మంది అంతర్జాతీయ మీడియా ప్రతినిధులకు ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శిస్తారని ఆయన చెప్పారు. చాలా కాలం తర్వాత ఒక భారతీయ పౌరాణిక చిత్రం ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శనకు ఎంపికైందనీ, ఆ గౌరవం తమ సినిమాకు దక్కడం ఆనందంగా వుందని సాయిబాబు అన్నారు.